వ్యక్తుల గురించి...వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలు, భావాలు
మిత్రమా! నమస్తే. విజయదశమి శుభాకాంక్షలతో... మన జీవనయానంలో ఎంతో మందిని కలుస్తాం. కుటుంబసభ్యులు మొదలుకొని, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు, తోటి ప్రయాణికులు, కొలీగ్స్, బాసులు మాత్రమే కాకుండా మనం ఏదో ఒకటి కొనే షాపుల్లోనో, వీధిలోనో మరెందరో కొత్తవారిని కలుస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు ఎదురవుతున్న వారి సంఖ్య తక్కువగా లేదు. ఇందులో చాలా మంది మన మీద ఎంతో ప్రభావం చూపుతారు. కొందరు మన మనసులపై, జీవితాలపై చెరగని ముద్రవేస్తారు. అందులో అందరూ మంచివారు లేదా అందరూ చెడ్డవారు ఉండరు. జీవితమే మంచి చెడుల మిశ్రమం. ఒకొక్కరితో మనకొకక్క అనుభవం ఉంటుంది. అందులో మెప్పించేవారు, నొప్పించేవారు, అబ్బో అనిపించేవారు, గబ్బుగా అనిపించేవారు పుష్కలంగా ఉంటారు. ఉత్సాహవంతులు-నిరుత్సాహపరులు, అమాయకులు-మాయగాళ్లు, ఆధునికులు-ఛాందసులు, విజేతలు-పరాజితులు, ఆశావహులు-నిరాశావాదులు, పోరాటయోధులు-అలిసిపోయినవారు, వాగుడుకాయలు-మితభాషులు, శాంతి బోధకులు-అశాంతి కాముకులు, ఆస్తికులు-నాస్తికులు, దానకర్ణులు-పీనాసులు... స్ఫూర్తి ప్రదాతలు, ఆలోచనాపరులు, నటులు, మూర్ఖులు, విషభుజంగాలు, నయవంచకులు దారిపొడవునా తారసపడతారు...