వ్యక్తుల గురించి...వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలు, భావాలు

 మిత్రమా!

నమస్తే. 

విజయదశమి శుభాకాంక్షలతో... 

మన జీవనయానంలో ఎంతో మందిని కలుస్తాం. కుటుంబసభ్యులు మొదలుకొని, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు, తోటి ప్రయాణికులు, కొలీగ్స్, బాసులు మాత్రమే కాకుండా మనం ఏదో ఒకటి కొనే షాపుల్లోనో, వీధిలోనో మరెందరో కొత్తవారిని కలుస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు ఎదురవుతున్న వారి సంఖ్య తక్కువగా లేదు. ఇందులో చాలా మంది మన మీద ఎంతో ప్రభావం చూపుతారు. కొందరు మన మనసులపై, జీవితాలపై చెరగని ముద్రవేస్తారు. 

 అందులో అందరూ మంచివారు లేదా అందరూ చెడ్డవారు ఉండరు. జీవితమే మంచి చెడుల మిశ్రమం. ఒకొక్కరితో మనకొకక్క అనుభవం ఉంటుంది. అందులో మెప్పించేవారు, నొప్పించేవారు, అబ్బో అనిపించేవారు, గబ్బుగా అనిపించేవారు పుష్కలంగా ఉంటారు. ఉత్సాహవంతులు-నిరుత్సాహపరులు, అమాయకులు-మాయగాళ్లు, ఆధునికులు-ఛాందసులు, విజేతలు-పరాజితులు, ఆశావహులు-నిరాశావాదులు, పోరాటయోధులు-అలిసిపోయినవారు, వాగుడుకాయలు-మితభాషులు, శాంతి బోధకులు-అశాంతి కాముకులు, ఆస్తికులు-నాస్తికులు, దానకర్ణులు-పీనాసులు... స్ఫూర్తి ప్రదాతలు, ఆలోచనాపరులు, నటులు, మూర్ఖులు, విషభుజంగాలు, నయవంచకులు దారిపొడవునా తారసపడతారు. మనం వారిలో కొందరితోనైనా ఎందుకో కనెక్ట్ అవుతాం. చాలామంది ఆనందం పంచి మధురమైన నేస్తాలుగానో, జ్ఞాపకాలుగానో  మిగిలిపోతారు. కొందరు విసిగించి, వేధించి, పీడించి, అనుమానించి, అవమానించి, గాయపరిచి, నష్టపరిచి చేదు అనుభవంగా గుర్తుంటారు. ఈ క్యారెక్టర్స్ గురించి ప్రస్తావన చేయకపోవడం, వాటి మాటలు, చేష్టలు, ధోరణులు రాయకపోవడం భావ్యం కాదనిపించింది. 

ఒక 20 ఏళ్ళు జర్నలిజం (ఈనాడు, ది హిందూ, మెయిల్ టుడే, మెట్రో ఇండియా) వృత్తిలో, ఐదేళ్లు జర్నలిజం బోధన (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) లో, మరో ఏడేళ్లు కమ్యూనికేషన్-పబ్లిక్ రిలేషన్స్ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) లో అనుభవం గడించిన నాకు నేను కలిసిన వారి గురించి, తెలిసిన వారి గురించి రాయడానికి ఎంతో ఉంది. నా అభిప్రాయాలు, అనుభవాలు, భావాలు పంచుకుంటూనే పాఠకులకు తమ జీవితంతో వివిధ వ్యక్తులతో ఎదురైన సంఘటనలు పంచుకునే వేదిక పంచడం ఈ బ్లాగ్ (భలే...మనుషులు) ముఖ్య ఉద్దేశం. 

అద్భుతమైన ఈ బ్లాగు ప్రపంచం నాకు సుపరిచితమే. తెలుగు మీడియా సంబంధ సమాచారాన్ని, విశ్లేషణలను పంచుకునేందుకు 2009 సెప్టెంబర్ 28 నాడు (తెలుగు వారి ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమి నాడు) 'ఏపీ మీడియా కబుర్లు' బ్లాగును ఆరంభించాం- నేను, జర్నలిస్టు అయిన నా శ్రీమతి హేమ. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన జూన్ 2, 2014 నుంచి ఈ బ్లాగ్ పేరును "ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" నుంచి "తెలుగు మీడియా కబుర్లు" గా మార్చి నడుపుతున్నాం.  

మళ్ళీ ఈ విజయ దశమి రోజు (2022 అక్టోబర్ 5) న ఈ కొత్త బ్లాగ్ మొదలుపెట్టడం ఆనందంగా ఉంది. నా బతుకు పుస్తకంలో చేరిన వ్యక్తుల పుటలను మీతో అతిశయోక్తులు గానీ, అబద్ధాలు గానీ లేకుండా ఉన్నది ఉన్నట్లు పంచుకోవాలని గట్టిగా భావిస్తున్నాను. కసి, కక్ష, కార్పణ్యం కాకుండా కేవలం సత్యం ప్రాతిపదికన ఈ కార్యం నిర్వహిస్తానని మీకు ముందుగా మాట ఇస్తున్నాను. ఈ క్రమంలో నేను ఎట్టిపరిస్థితిలోనూ దారితప్పబోనని, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, పాఠకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా దిద్దుబాటు చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. 

విజయదశమి శుభాకాంక్షలతో... 

డాక్టర్ ఎస్. రాము 

హైదరాబాద్

కామెంట్‌లు

  1. శుభాకాంక్షలు డాక్టర్ రాము గారు

    రిప్లయితొలగించండి
  2. ఆల్ ద బెస్ట్ రామూ అన్నగారు

    రిప్లయితొలగించండి
  3. మంచి ప్రయత్నం.. మనసు విప్పి చెప్పుకునే మంచి చోటు సర్ , థాంక్యూ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి